
ఇళ్ల గ్రౌండింగ్ వేగిరం చేయండి
● పనులు ముమ్మరంగా సాగాలి ● కలెక్టర్ హైమావతి ● ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం
వ్యాధుల వేళ అప్రమత్తత అవసరం
డాక్టర్ల డిప్యుటేషన్లు రద్దు చేశాం
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై ఏంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కింగ్ చేశాక బేస్ మెంట్ లెవెల్ వరకు రాని వారి వివరాలు తన వద్దకు తీసుకురావాలని సూచించారు. బేస్‌మెంట్ లెవెల్ పూర్తయ్యాక ఇంజనీర్ అధికారులు సందర్శించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి సుముఖంగా లేని వారితో లేటర్ తీసుకుని మరొక లబ్ధిదారునికి అందజేయాలన్నారు. రోజు గ్రామాలకు వెళ్లి పంచాయతీ కార్యదర్శి ల పనితీరును పర్యవేక్షించాలన్నారు. మండలాల్లో ఇసుక కొరత లేకుండా చూసుకోవాలన్నారు. మున్సిపల్ లో సైతం ఇందిరమ్మ ఇళ్లు వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటకమాన్: సీజనల్ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. జిల్లా కేంద్రంలోని నాసర్‌పూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇందిరానగర్ బస్తీ దవాఖానను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్‌లోని సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్, మందుల స్టాక్ వివరాలపై ఆరా తీశారు. సెంటర్‌కు వచ్చిన రోగులతో మాట్లాడారు. అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. రోజూ పది నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నంగునూరు(సిద్దిపేట): డాక్టర్ల డిప్యుటేషన్లు రద్దు చేశామని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందికి సూచించారు. రాజగోపాల్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్, అవుట్ పేషంట్ రికార్డులను పరిశీలించారు. ఓపీ రిజిష్టర్‌ను వైద్యులు మాత్రమే రాయాలని, స్టాఫ్‌నర్సు రాస్తూ మందులు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వర్షాల వేళ ముందస్తు చర్యలు
రాబోవు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మైనర్, మేజర్ రిజర్వాయర్లలో నీటీ నిల్వలను పరిశీలించాలన్నారు. జిల్లాలోని మోయతుమ్మెద, హల్దీ వాగులు పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. పిడుగుపాటుకు గురై పశువులు మృతిచెందితే పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. అధికారులు స్థానికంగా ఉండి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

ఇళ్ల గ్రౌండింగ్ వేగిరం చేయండి