
మల్లన్నా.. మహాసత్రం కలేనా?
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో వంద గదుల (మహా సత్రం) నిర్మాణానికి అడుగులు ముందుకు పడటంలేదు. భారీగా విరాళాలు రాకపోవడంతో పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోవడంలేదు. ఆలయంలో ఇప్పటి వరకు 120 వరకు దాతల సహకారంతో నిర్మించిన వసతి గదులు ఉన్నాయి. బండ గుట్టపై ప్రభుత్వం, ఆలయ నిధులతో 50 గదుల నిర్మాణం చేపడుతున్నారు. స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మరో 100 గదులు దాతల సహకారంతో నిర్మించేందుకు ఆలయ అధికారులు రెండేళ్ల క్రితం ప్రణాళికలు రూపొందించారు. వీటి నిర్మాణం కోసం రూ.17 కోట్లు అవసరమని అంచనా వేశారు. వంద గదులలో 20 గదులు ఆలయం తరుపున నిర్మించనుండగా.. మిగతా 80 గదులు దాతల సహకారంతో నిర్మాణం చేపట్టాలని ఆనాటి ఆలయ ఈఓ బాలాజీ ప్రణాళిక రూపొందించి దేవాదాయ శాఖ అనుమతికి పంపించారు. దీంతో ఆలయ అధికారులు దాతలనుంచి విరాళాలు సేకరించే పనిలో పడ్డారు.
భక్తుల్లో అసహనం
ఇంత వరకు ఆరుగురు దాతలు విరాళం అందించారు. ఒక్కొక్కరు రూ.15 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఆలయ అధికారులు మాత్రం గదులు నిర్మాణ పనులు ప్రారంభం రోజు సుమారు మరో 40 భక్తులు విరాళాలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖకు కేవలం ప్లాను మాత్రమే పంపించారు. ఇప్పటి వరకు దానికి కావాల్సిన ఎస్టిమేషన్‌ను ఆలయంలో ఏఈ లేక పోవడంతో పంపించ లేక పోయారు. రెండేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో భక్తుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. సుమారు 74 మంది దాతలు ముందుకు వస్తేనే పనులు ప్రారంభం అయ్యేలా లేవు. ఆలయ ఈఓ అన్నపూర్ణ ఈనెలలో పదవీ విరమణ చేయనుండటంతో పనుల ప్రారంభంపై సందేహం వ్యక్తం అవుతోంది. ఆలయ అధికారులు స్పందించి వసతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించి భక్తుల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.
వంద గదుల నిర్మాణం జరిగేనా? ముందుకు రాని దాతలు ఇప్పటి వరకు ఆరుగురే విరాళాలు అందజేత
అనుమతులు రాగానే ప్రారంభిస్తాం
దాతల సహకారంతో 100 గదుల సత్రాన్ని నిర్మిస్తాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. సుమారు 40 మంది దాతలు విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు అందిన విరాళాలు ప్రత్యేక అకౌంట్‌లో భద్రంగా ఉన్నాయి.
–అన్నపూర్ణ, ఆలయ ఈఓ

మల్లన్నా.. మహాసత్రం కలేనా?

మల్లన్నా.. మహాసత్రం కలేనా?