
యూరియా పక్కదారి పట్టొద్దు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
కొమురవెల్లి(సిద్దిపేట): యూరియాను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని జిల్లావ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి ఎరువుల దుకాణాల యజమానులను హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు మర్రిముచ్చాల, గౌరయపల్లి, అయినాపూర్‌లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఎరువులు విక్రయిస్తూ ఏరోజుకు ఆరోజు స్టాక్ రాయాలని సూచించారు. అందుకు భిన్నంగా వ్యవహరించినా, నకిలీ మందులు విక్రయించినా చర్యలు తప్పవన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ తదితరులు పాల్గొన్నారు.
తొగుటలో బారులు
తొగుట(దుబ్బాక): మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులుతీరారు. స్థానిక ఫర్టిలైజర్ దుకాణానికి మంగళవారం యూరియా లారీ వచ్చింది. సమాచారం అందుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయం నుంచే క్యూలో నిల్చున్నారు. అధికారుల సమక్షంలో రైతుకు రెండు బ్యాగుల చొప్పున అందజేశారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేసుకుంటారు. మొక్కజొన్న కంకులు వేసే దశకు, పత్తి పూత దశకు వచ్చాయి. ఈ క్రమంలోనూ యూరియాతో పాటు పోటాష్ కలిపి వేస్తారు. అదనుతప్పితే పంటలకు ఎరువులు వేసినా ప్రయోజనం ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తంచేశారు.