
చెత్త బండ్లకు తుప్పు
● లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు ● నిర్వహణ లేక మూడేళ్లకే మూలకు ● పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
చేర్యాల(సిద్దిపేట): లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన చెత్త బండ్లు.. నిర్వహణ లేక మూడేళ్లకే మూలన పడ్డాయి. బాగుచేయించేందుకు షెడ్‌కు పంపిన అధికారులు యేళ్లు గడుస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పుపట్టిన స్థితిలో జిల్లా కేంద్రంలోని మారుతి షోరూంలో ఉంది చేర్యాలలో చెత్త సేకరించాల్సిన వాహనం.
రూ. 92 లక్షలు వెచ్చించి..
2018లో చేర్యాల పట్టణం మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. కొద్ది రోజుల పాటు ప్రత్యేక అధికారి పాలన అనంతరం 2019 జనవరిలో జరిగిన ఎన్నికల్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. కొత్త పాలకవర్గం కొలువైన కొద్ది రోజులకు పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెత్త సేకరణ కోసం నాలుగు ఆటోలు కొనుగోలు చేశారు. అనంతరం 2021లో మరో రెండు ఆటోలు, 2022లో ఆరు ఆటోలు మొత్తం 12 ఆటోలు రూ.92లక్షల ఖర్చు చేసి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో నిర్వహణ సరిగా లేక రెండు ఆటోలు రిపేర్‌కు వచ్చాయి. వాటిని సుమారు మూడేళ్ల క్రితం జిల్లాకేంద్రంలోని రిపేర్ కేంద్రాలకు పంపించారు. అయితే అధికారులు వాటి సంగతే మర్చి పోయారు. మారుతీ సుజికీ కంపెనీకి చెందిన ఆటో మారుతీ షోరూంలో ఉండగా మరో ఆటో ప్రైవేటు మెకానిక్ వద్ద ఉన్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే చెత్త సేకరణ బండ్ల నిర్వహణ కోసం కాంట్రాక్టర్‌ను నియమించారు. కానీ కాంట్రాక్టర్ చేత నిర్వహణ చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనడానికి షెడ్డులో ఉన్న చెత్త బండ్లే నిదర్శనం. చెత్త బండ్ల నిర్వహణే ఇలా ఉంటే.. చేర్యాలలో చెత్త సేకరణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి (అదనపు కలెక్టర్) స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ముగ్గురు కమిషనర్లు మారినా..
ఈ మూడేళ్లలో ముగ్గురు కమిషనర్లు మారినా మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణకు ఎన్ని ఆటోలు ఉన్నాయి? ఎన్ని పనిచేస్తున్నాయి? పని చేయని ఆటోలపై ఆరా తీసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఉన్న కమిషనర్ వచ్చి యేడాది దాటింది. ఇప్పటికీ ఆ రెండు ఆటోలు ఏమయ్యాయన్న విచారణ చేసిందీ లేదు.