
‘ఆధార్’ లేక అవస్థలు
● సెంటర్ కోసం ఏళ్లుగా ఎదురుచూపులు ● ఇతర ప్రాంతాలకు పరుగులు ● పట్టించుకోని అధికారులు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ అంశం ఆధార్‌తో ముడిపడి ఉంది. సంక్షేమ పథకాలు, పంట విక్రయాలు, పాఠశాలల అడ్మిషన్లు వంటి వాటికీ ఆధార్‌కార్డు తప్పనిసరి. ఆధార్‌లో చిరునామా మార్పులకు, చిన్నారులకు కొత్తగా ఆధార్ తీసుకునేందుకు, వేలిముద్రలు అప్‌డేట్ చేసేందుకు ఆధార్ కేంద్రాల వద్దకు పరుగులు తీయాల్సిందే. అక్కన్నపేట మండల కేంద్రంగా ఏర్పాటై దాదాపుగా తొమ్మిదేళ్లు కావస్తున్నా ఆధార్ సెంటర్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మండల వ్యాప్తంగా మొత్తం 38గ్రామాలుగా ఉండగా సుమారుగా 65కుపైగా గిరిజనతండాలతో పాటు మారుమూల పల్లెలు ఉన్నాయి. దాదాపుగా 35వేలకుపైగా జనాభా ఉంటుంది.
సెంటర్ మంజూరుకు డిమాండ్
ప్రభుత్వం ప్రవేశపట్టే ఏ పథకం అమలు చేయాలన్నా లబ్ధిదారుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడో పదేళ్ల కిందట తీయించుకున్న ఆధార్ కార్డును అధికారులకు సమర్పిస్తుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కాలేదంటూ పంపించివేస్తున్నారు. అలాగే చిన్నారులకు ఆధార్ తీయించాలన్నా, తప్పుల సవరణ కోసం వెళ్లాలంటే దాదాపుగా 15నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్నాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సమయం వృథా కావడంతో పాటు ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి తక్షణమే ఆధార్ సెంటర్ మంజూరు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఏర్పాటు చేయాలి
మండల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆధార్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. అన్ని పనులకు ఆధార్‌కార్డు తప్పనిసరిగా మారింది. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలి.
– మహేందర్‌రెడ్డి, బీజేపీ నేత, అక్కన్నపేట