
డెంగీ.. డేంజర్ బెల్స్
జిల్లాలో 18 కేసులు నమోదు ●
● విజృంభిస్తున్న విషజ్వరాలు ● గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం ● దోమల నివారణకు చర్యలు శూన్యం
జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వర్షాలు జోరుగా కురుస్తుండటంతో దోమల వ్యాప్తి సైతం తీవ్రంగాపెరిగింది. దీంతో సీజనల్ వ్యాధులు తాండవం చేస్తున్నాయి.
దుబ్బాకటౌన్: జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తుండగా మరోవైపు డెంగీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. చేర్యాల మండలం కడవేర్గు, దౌల్తాబాద్ మండలం లింగరాజ్‌పల్లి సంక్షేమ హాస్టల్‌లో, జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్, మర్కూర్, దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్‌లో, దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో గజ్వేల్‌లో పిడిచెడ్, తదితర మండలాల్లో కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా 18 కేసులు నమోదైనా అనధికారికంగా కేసులు ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది.
నిధుల కొరత
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పంచాయతీల్లో నిధులు లేక కార్యదర్శులు సైతం దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. జిల్లాలో అక్కడక్కడా తమ సొంత ఖర్చులతో అరకొర నివారణ చర్యలు చేపడుతున్నారు. దోమల నివారణ, పారిశుద్ధ్య పనులకు జిల్లాలో ఉన్న 508 గ్రామ పంచాయతీలకు, 5 మున్సిపాలిటీలకు నిధులు కేటాయించేందుకు పాలకులు చర్యలు చేపట్టాలన్న డిమాండ్ పెరుడుతోంది.
లోపించిన పారిశుద్ధ్యం
గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మురికి కాలువలు శుభ్రం చేయడంలో, పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దోమలు, ఈగలు తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులకు దారి తీస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
విజృంభిస్తున్న దోమలు
పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విజృంభిస్తున్నాయి. నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పెంట కుప్పలపై, గడ్డి పొదల్లో, మురికి కాలువల్లో దోమల వ్యాప్తి పెరుగుతోంది. కొన్ని చోట్ల ఫాగింగ్ మిషన్లు సైతం పనిచేయడంలేదు. దీంతో వాటిని మూలాన పడేశారు. వాటికి మరమ్మతులు చేయించేందుకు నిధుల కొరత అడ్డంకిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.
జ్వరం వస్తే ఆలస్యం చేయొద్దు
దోమల వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. నిల్వ నీటిని ఉంచకండి. నిల్వ నీటిలో లార్వా ద్వారా ఏడిస్(టైగర్) దోమ వాప్తి చెందుతుంది. జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ అస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించాలి. ఆస్పత్రుల్లో డెంగీ, ఇతర విష జ్వరాలకు మందులు అందుబాటులో ఉన్నాయి.
– ధనరాజ్, డీఎంహెచ్‌ఓ
అప్రమత్తతే శ్రీరామ రక్ష
జిల్లాలో ఉన్న 508 గ్రామ పంచాయతీల్లో వారానికి రెండు సార్లు గ్రామ కార్యదర్శులు, ఎన్‌ఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిల్వ నీటిని తొలగించేలా, డెంగ్యూ వ్యాప్తి, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అప్రమత్తతతోనే వ్యాధిని దూరం చేయవచ్చు.
–దేవకీదేవి, జిల్లా పంచాయతీ అధికారి