
గిట్టుబాటు ఏదీ?
క్రమంగా తగ్గుతున్న ఆయిల్‌పామ్ ధర
● గతంలో టన్నుకు రూ.21వేలకుపైనే ● నేడు రూ.17,500కు పడిపోయిన దైన్యం ● దిగాలు చెందుతున్న రైతులు ● జిల్లాలో 13వేల ఎకరాలకుపైగా సాగు
ఆయిల్‌పామ్ ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో టన్నుకు రూ. 21వేలకుపైగా పలికిన ధర నేడు రూ.17,500కు పడిపోయింది. 13వేల ఎకరాలకుపైగా ఆయిల్‌పామ్ సాగుతో జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పుడిప్పుడే జిల్లాలో ఉత్పత్తులు రావడం ఊపందుకోగా.. గిట్టుబాటు లభించక రైతులు దిగాలు చెందుతున్నారు.
గజ్వేల్: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2021– 22లో ఈ ప్రయత్నం మొదలవ్వగా.. ప్రస్తుతం 13వేల ఎకరాల పైచిలుకు చేరుకుంది. ఆయిల్‌పామ్‌పై రైతులను ప్రోత్సహిస్తూ వివిధ రకాల సబ్సిడీలను అందిస్తూ సాగును పెంచుతున్నారు. గతంలో ఆయిల్‌పామ్ టన్నుకు రూ.21వేలకుపైగా పలికితే నేడు రూ.17,500కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే ఆయిల్‌పామ్ సాగుతో పెద్దగా మేలు చేకూరిందేమీలేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఉత్పత్తులను నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నుంచి అశ్వరావుపేటకు తరలిస్తున్నారు. గజ్వేల్ ప్రాంతం నుంచి ఉత్పత్తులను తరలించాలంటే రెండు టన్నులకు కూలీల ఖర్చు, ట్రాక్టర్ రవాణా ఖర్చులు కలుపుకొని రూ.9వేలపైచిలుకు వ్యయం అవుతోంది. రెండు టన్నులకు రైతులకు టన్నుకు రూ.17500చొప్పున లెక్కిస్తే రూ.35వేల వరకు వస్తున్నాయి. ఇందులో ఖర్చులుపోనూ రూ.26వేలు మిగలడం గగనమవుతోంది. ఒకవేళ నాణ్యతలేని గెలలు ఉంటే రైతుకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది.అంతేకాకుండా.. నాలుగేళ్లుగా రైతు శ్రమ, పెట్టుబడితో పోలిస్తే వస్తున్న ఆదాయానికి పెద్దగా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు.
ఎందుకీ ఈ పరిస్థితి?
ధరలు తగ్గడానికి పలు అంశాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా దిగుమతులపై మన దేశం సుంకం తగ్గించడంతో ధరలు క్రమంగా పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఈ పరిస్థితి నుంచి రైతులను గట్టించడానికి రవాణా ఖర్చులివ్వాలి. అలాగే అడవి పందుల బెడద ఉన్నందు వల్ల సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలి.
త్వరలోనే క్రషింగ్ ప్రారంభం
ఆయిల్‌పామ్ పండించిన రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలను సులభతరం చేయడానికి నర్మెటలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించిన సంగతి తెల్సిందే. త్వరలోనే ఇక్కడ క్రషింగ్ ప్రారంభించడానికి సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రూ.22 వేలకుపైగా పలికితేనే మేలు
నాలుగు ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశాను. ఇప్పటివరకు నాలుగు కోతలు వచ్చాయి. ధర సక్రమంగా లేకపోవడం నిరాశ పరుస్తోంది. టన్ను ధర రూ.22వేల పైచిలుకు పలికితే మేలు జరుగుతుంది.
– రైతు మద్ది రాజిరెడ్డి, ఆహ్మదీపూర్