
నులిమేద్దాం
● నులిపురుగులతో పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం ● రక్తహీనత, పోషకాహారలోపాలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): నులి పురుగుల సంక్రమణ ప్రధానంగా అపరిశుభ్రతతోనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆరుబయట అపరిశుభ్ర వాతావరణంలో ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా అన్నం తినడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల పిల్లల కడుపులో నులి పురుగులు తయారయ్యే అవకాశం ఉంది. ఈ పురుగులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందుతాయి. నులిపురుగుల బారిన పిల్లలు పడకుండా ఆరోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో, కళాశాలల్లో నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చేందుకు జిల్లా వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఏడాదిలో రెండు సార్లు పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలను వేస్తారు. సాధారణంగా అయితే ఫిబ్రవరి 10న జాతీయ నులి పురుగుల దినోత్సవం. కానీ వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కనుక ఆగస్టు 11న సైతం మరోసారి పిల్లలను నులి పురుగుల నివారణ మాత్రలు వేయనున్నారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వరకు 2,29,720 మంది బాలబాలికలు ఉన్నారు.
నులి పురుగులతో ఆరోగ్య సమస్యలు
పిల్లల్లో నులి పురుగులు ఉంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. నులి పురుగులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులు. వీటి ద్వారా రక్తహీనత, పోషకాహారలోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. నులి పురుగుల నివారణ మాత్రతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
వీటికి దూరంగా ఉంటే మంచిది
పిల్లలు నులి పురుగుల బారిన పడకుండా ఉండాలంటే చాక్లెట్లు, ఇతర తీపి పదార్థాలు ఎక్కువగా తీనిపించకూడదని వైద్యులు చెబుతున్నారు. చాక్లెట్, జిగురు పదార్థాలు తినిపిస్తే నులిపురుగులు ఏర్పడేందుకు అవకాశం ఉందని, నిర్లక్ష్యం చేస్తే కడుపులో తయారైన పురుగులు మెదడుకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నేటి నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
సిద్దిపేటకమాన్: నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని ప్రోగ్రాం ఆఫీసర్లు, సిబ్బందితో డీఎంహెచ్‌ఓ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపాక కేజీబీవీ పాఠశాలలో కలెక్టర్‌చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఆరోగ్య, వైద్య సిబ్బంది మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒక ఏడాది నుంచి 19ఏళ్లలోపు వారికి మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం అనంతరం ప్లిలలకు వయసు ఆధారంగా మాత్రలు వేయించాలన్నారు. సోమవారం మాత్రలు వేసుకోని పిల్లలకు ఈ నెల 18న ఆరోగ్య సిబ్బందిచే మాత్రలు పంపిణీ చేయడం చేస్తామన్నారు.