
జోరందుకునే అడ్‘మిషన్లు’!
● హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ షురూ ● వసతుల కల్పనకు నడుం బిగించిన అధికారులు ● 14న కళాశాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి!
హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ పరిధి లోని ఇంజనీరింగ్ కళాశాలకు కేటాయించిన సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి కళాశాలలో ప్రవేశం పొందాక మరో కళాశాలకు వెళ్లకుండా అన్ని వసతు లు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లాలోనే తొలి శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను హుస్నాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉండటంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఉమ్మా పూర్ గుట్టల సమీపంలో 30 ఎకరాలు కేటాయించా రు. కళాశాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 44.12 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టణ శివారులోని గాంధీనగర్ సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల పైఅంతస్తులో తాత్కాలికంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు.
హాస్టల్ వసతి కల్పిస్తే పెరగనున్న ప్రవేశాలు
ప్రస్తుతం మొదటి సంవత్సరం అన్ని బ్రాంచ్‌లలో 91 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. 3వ విడత కౌన్సెలింగ్‌లో హాస్టల్ వసతి కల్పిస్తే అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంటుందని కళాశాల యాజమాన్యం భావిస్తోంది. ఇటీవల ఇంజనీరింగ్ కళాశాలను కలెక్టర్ హైమావతి సందర్శించి సీట్ల భర్తీ, సౌకర్యాల గురించి ఆరా తీశారు. హాస్టల్ వసతి కల్పిస్తే అడ్మిషన్లు అధికంగా వస్తాయని కళాశాల ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టి తీసుకురాగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అలాగే హుస్నాబాద్ నుంచి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పించనున్నామని తెలిపారు.
పేద విద్యార్థులకు వరంలాంటిది
ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు మరో కళాశాలకు వెళ్లకుండా హుస్నాబాద్ పట్టణంలో హాస్టల్ వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే హుస్నాబాద్ నుంచి కళాశాల వరకు బస్సు సౌకర్యం కూడా కల్పించనున్నాం. ఈ ఇంజనీరింగ్ కళాశాల పేద విద్యార్థులకు వరంలాంటిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–ఉమేశ్ కుమార్, ఉపకులపతి,
శాతవాహన యూనివర్సిటీ
నాలుగు కోర్సులతో 240 సీట్లు
కళాశాలలో సీఎస్‌ఏ, సీఎస్‌ఈ, ఈసీఈ, ఐఎన్‌ఎఫ్ నాలుగు కోర్సులు ప్రవేశపెట్టారు. ఒక్కో బ్రాంచ్‌కు 60 సీట్ల చొప్పున 240 సీట్లు కేటాయించారు. వీటితోపాటుగా ఈడబ్ల్యూఎస్ కింద మరో 24 మందికి అడ్మిషన్లు కల్పించనున్నారు. అలాగే కళాశాలకు 54 మంది బోధన, 33 మంది బోధనేతర రెగ్యులర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో పెద్దఎత్తున సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో 160 మంది విద్యార్థులు చేరారు. అయితే కళాశాలకు హాస్టల్ సౌకర్యం లేని కారణంగా చాలామంది విద్యార్థులు 2వ విడత కౌన్సెలింగ్‌లో వేరే కళాశాలను ఎంచుకుంటున్నారు.
14న సీఎం రేవంత్‌రెడ్డి రాక
శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను ఈ నెల 14న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు సమాచారం. దీంతో కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఐఓసీ ప్రధాన రోడ్డు నుంచి కళాశాల వరకు సీసీ రోడ్ల పనులు వేగవంతం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీటి కోసం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు.

జోరందుకునే అడ్‘మిషన్లు’!

జోరందుకునే అడ్‘మిషన్లు’!