
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: భవిష్యత్‌లో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం ఐక్యంగా ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం క్విట్ ఇండియా డే సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ‘నప్రత్ చోడో...భారత్ జోడో’అని రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ చెబుతున్నారన్నారు. భావితరాలకు జీవించే హక్కు, స్వేచ్ఛ అన్ని రకాల హక్కులు పొందాలంటే ప్రజాస్వామిక రాజ్యాంగ రక్షణ కొనసాగాలని చెప్పారు. అప్రజాస్వామిక వాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు
స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.