
పనులు వేగవంతం చేయాలి
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్
సిద్దిపేటజోన్: పట్టణంలో ఆయా వార్డుల్లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు అభివృద్ధి పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద బస్తీ దవాఖాన పరిశీలించారు. వానాకాలంలో ఇబ్బందులు లేకుండా భవనంలో మరమ్మతు లు చేయాలని సూచించారు. అనంతరం ఎన్జీఓ కాలనీలో నూతన బస్తీ దవాఖాన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. గదుల నిర్మాణం, స్లాబ్ పనులను పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ కాలనీ బస్తి దవాఖాన పరిశీలించి మరమ్మతుల గురించి ఆరా తీశారు. ఆయన వెంట మున్సిపల్ డీఈ ప్రేరణ, అధికారులు ఉన్నారు.
ప్లాస్టిక్ గ్లాసులు
వినియోగిస్తే జరిమానా
జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి
బెజ్జంకి(సిద్దిపేట): ప్లాస్టిక్ గ్లాసులను వినియోగించినా, విక్రయించినా జరిమానా విధిస్తామని డీపీఓ దేవకీదేవి అన్నారు. బెజ్జంకి క్రాసింగ్‌లో శుక్రవారం నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న డీపీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు వినియోగించే వారికి జరిమానాలు విధించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీఓ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని రక్షిద్దాం
సిద్దిపేటఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శుక్రవారం వృక్షాబంధన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు నాటి కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. మొక్కలు నాటి అవి వృక్షాలుగా ఎదిగే వరకు కాపాడాలన్నారు. వృక్ష సంపద జీవకోటికి ఆధారమన్నారు.

పనులు వేగవంతం చేయాలి