
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మద్దూరు(హుస్నాబాద్): వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు లద్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. లద్నూరు ఆస్పత్రిలో ఫైలేరియాకు సంబంధించిన మందులు లేవని పలువురు రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రిలో ఉన్న ముగ్గురు డాక్టర్లకు కేవలం ఒక్కరే హాజరు కావడంపై కలెక్టర్ ప్రశ్నించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేత్ర వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేయాలని డీఎంహెచ్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రసవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాయాలని సందర్శించి భూ భారతి ఫైళ్లను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు పనితీరు మార్చుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ రహీం,ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వైద్యులు 24 గంటలూ
అందుబాటులో ఉండాలి
కలెక్టర్ హైమావతి