
‘మైనంపల్లి’ తీరువల్లే కాంగ్రెస్‌లో గ్రూపులు
● దళిత సంఘాల నాయకుల మండిపాటు ● గజ్వేల్‌లో నర్సారెడ్డికి మద్దతుగా ర్యాలీ
గజ్వేల్: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీరువల్లే గజ్వేల్ కాంగ్రెస్‌లో గ్రూపులు ఏర్పడ్డాయని వర్గల్ మాజీ ఎంపీపీ మోహన్, దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం గజ్వేల్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్, హరీశ్‌రావులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజలకు నర్సారెడ్డి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. పదవుల్లోనూ దళితులకు సముచిత స్థానం కల్పించారని చెప్పారు. నర్సారెడ్డికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సారెడ్డిపై దళిత వ్యతిరేకి ముద్ర వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై నమోదైన అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, కొడకండ్ల నర్సింహు లు, వీరేశం, అండాలమ్మ, శివులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, నాయకులు మహేందర్, శ్రీనివాస్, వెంకటేష్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.
నర్సారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి
కాంగ్రెస్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్‌కుమార్‌ను కులం పేరుతో దూషించి దాడి చేసిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బుధవారం గజ్వేల్ ఏసీపీ నర్సింహులుకు దళిత సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉబ్బని ఆంజనేయులు, సీనియర్ నాయకులు మైస రాములు, పొన్నాల కుమార్ పాల్గొన్నారు.