సర్వేయర్లొస్తున్నారు..! | - | Sakshi
Sakshi News home page

సర్వేయర్లొస్తున్నారు..!

May 30 2025 7:03 AM | Updated on May 30 2025 7:03 AM

సర్వేయర్లొస్తున్నారు..!

సర్వేయర్లొస్తున్నారు..!

జిల్లా వ్యాప్తంగా 352 మంది దరఖాస్తు

మొదటి బ్యాచ్‌కు 175 మంది ఎంపిక

50 రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ

ఇక కచ్చితమైన మ్యాప్‌ల రూపకల్పన

సాక్షి, సిద్దిపేట: భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు రాబోతున్నారు. ఈ మధ్య కాలంలో కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి భూమి కొలతకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. వాటిని పరిష్కరించేందుకు అన్ని మండలాలకు సర్వేయర్లు లేకపోవడంతో సమస్య రోజురోజుకు సమస్య జటిలంగా మారుతోంది. ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చింది. అందులో భాగంగా సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి నియమించాలని నిర్ణయించింది.

భూ సమస్యలే ఎక్కువ

ప్రస్తుతం ఉన్న భూముల సర్వే నిజాం కాలం నాటివి. దాంతో చాలా వరకు హద్దులు తెలియక నిత్యం ఎక్కడో చోట భూ పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 26 మండలాలకు 16 మందే ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారు. ఒక్కో సర్వేయర్‌కు రెండు నుంచి మూడు మండలాలు కేటాయించడంతో సమయం సరిపోవడం లేదు. దీంతో జిల్లాలో సర్వే కోసం 3 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ సర్వేయర్లు తక్కువగా ఉండటంతో భూ సమస్యలు పరిష్కరించడం కష్టంగా మారుతోంది. దీంతో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి.

కచ్చితమైన మ్యాప్‌లు

సాంకేతికంగా ఎన్ని మార్పులు వచ్చినా ఈ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. మారుతున్న సాంకేతిక ఆధారంగా కచ్చితమైన మ్యాప్‌ను రూపొందించేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల వ్యవస్థ విధానాన్ని అమలు చేయడం ద్వారా భవిష్యత్‌లో భూములకు సంబంధించిన వివాదాలు తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉంటాయని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం లాంటి వివరాలతో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. ఆ భూమికి సంబంధించిన మ్యాప్‌ ఉండటం లేదు. కాగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే రిజిస్ట్రేషన్‌ కంటే ముందే భూమికి సంబంధించిన పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ప్రభుత్వ సర్వేయర్లు వాటిని పరిశీలించిన తర్వాత ఆమోదిస్తారు. ఇక మీదట భూములు రిజిస్ట్రేషన్లు జరిగే సమయంలో సర్వే హద్దులను నక్షాల్లో పొందుపరిచిన తరువాతే చేపట్టనున్నారు. కొత్తగా సర్వేయర్లు వస్తే గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.

50 రోజుల పాటు శిక్షణ

జిల్లా వ్యాప్తంగా లైసెన్స్‌ సర్వేయర్ల శిక్షణకు డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌, డిప్లొమా, బీటెక్‌ సివిల్‌, ఇంటర్‌లో 60శాతం మార్కులతో గణితం సబ్జెక్ట్‌ పూర్తయిన వారిని నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ శిక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలి విడతలో 175 మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించారు. ఇవి 50 రోజుల పాటు కొనసాగనుంది. ఏడుగురు సర్వేయర్లు, ఒక రిటైర్డ్‌ సర్వేయర్‌తో శిక్షణ ఇప్పిస్తున్నారు. పాలిటెక్నిక్‌, ఐటీఐలకు చెందిన అధ్యాపకులచే కొంత థియరీ చెప్పిస్తే మరింత సులభంగా అర్థమవుతుంది. టిప్పన్‌ ప్లాటింగ్‌, క్షేత్రస్థాయి విషయాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం పరీక్షను నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లుగా ధ్రువపత్రాలను అందించనున్నారు.

శిక్షణ కొనసాగుతుంది

జిల్లా వ్యాప్తంగా 352 మంది ల్యాండ్‌ సర్వేయర్‌ శిక్షణ కోసం దరఖాస్తు చేశారు. అందులో మొదటి బ్యాచ్‌కు 175 మందిని ఎంపిక చేశాం. వీరికి ఈ నెల 26వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించాం. ఏడుగురు సర్వేయర్‌లను, ఒక రిటైర్డ్‌ సర్వేయర్‌తో శిక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులకు మెటీరియల్‌ను అందజేశాం.

– వినయ్‌ కుమార్‌,

ఏడీ, ల్యాండ్‌ సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement