మహిళల రక్షణకు పెద్దపీట
సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: మహిళలు, పిల్లల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది గత నెలలో 47 ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 45మంది ఈవ్‌టీజర్లను పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించి, పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 87126 67434కు ఫోన్ చేయాలని సూచించారు.
కేతకీలో భక్తుల సందడి
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయం గురువారం భక్తులతో సందడిగా మారింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అనంతరం గర్భగుడిలోని పార్వతిపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
డీలక్స్ బస్సుల్లో రాయితీ
నారాయణఖేడ్: ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి చార్జీల్లో 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. నెలవారీ సీజన్ టికెట్‌పై 20 రోజుల చార్జీతో 30 రోజులు ప్రయాణం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సదుపాయం ఈ నెల 1వ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఖేడ్ నుంచి జేబీఎస్‌కు రూ.230 చార్జీకి రాయితీతో రూ. 210 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఖేడ్ నుంచి లింగంపల్లికి రూ.210 గాను రూ. 190, ఖేడ్ నుంచి సంగారెడ్డికి రూ. 160కి గాను రూ.140 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అలాగే ఖేడ్ నుంచి సంగారెడ్డి వరకు గల వివిధ స్టేజీలకు మంత్లీ సీజన్ టికెట్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు.


