
వక్ఫ్ సవరణ చట్టంపై అపోహలు నమ్మొద్దు
ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: వక్ఫ్ సవరణ చట్టంపై పేద ముస్లింలలో అపోహలు సృష్టిస్తూ అల్లర్లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 12,892 ఎకరాలు వక్ఫ్ భూములుగా నమోదు చేయడం వల్ల వేల మంది రైతులు హక్కులు కోల్పోయారని వాపోయారు. కొండాపూర్ మండలం సైదాపూర్‌లో 197 ఎకరాలు వక్ఫ్ జాబితాలో చేరడం వల్ల సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో పెద్ద ఎత్తున భూములు వక్ఫ్ జాబితాలో చేరాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాతబస్తీ వక్ఫ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వివరాలు ఇవ్వాలనీ, ముతావలీలు ఎవరి పేర్లపై లీజులకు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘పట్టణాల్లో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురవుతున్నా, అసలు లబ్ధిదారులైన పేద ముస్లింలకు ఉపయోగం లేకుండా పోతోందని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని తెలిపారు. రైతులు, ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేశ్వర్ రావు దేశ్ పాండేతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.