● ఓయూ కామర్స్ డీన్ కృష్ణచైతన్య ● కామర్స్ విద్యార్థులకు ఒకరోజు వర్క్‌షాప్
సిద్దిపేటఎడ్యుకేషన్: నిపుణులైన అధ్యాకుల పర్యవేక్షణలో ఉత్తమ ప్రాజెక్టులను రూపొందిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ కృష్ణచైతన్య అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ప్రాజెక్టుల తయారీ, పరిశోధనా మెలకువలపై మంగళవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో పీజీ ఫైనలియర్ విద్యార్థులకు ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో సామాజిక సమస్యలపై అవగాహన, సూక్ష్మపరిశీలన, పరిశోధనపై జిజ్ఞాస పెంపొందుతుందన్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో పాటించాల్సిన మెలకువలు, నివేదికలు తయారుచేసి సమర్పించాల్సిన విధానాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులు సానుకూల దృక్పధాన్ని అలవర్చుకుని పరిశోధన మెలకువలతో ఉత్తమ ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు. వర్క్‌షాప్ కన్వీనర్ డాక్టర్ గోపాల సుదర్శనం మాట్లాడుతూ పరిశోధనా సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలు, ఫలితాల విశ్లేషణ సాధనాలను అర్థం చేసుకోవాలన్నారు.