అలసత్వం.. సమన్వయ లోపం.. | - | Sakshi
Sakshi News home page

అలసత్వం.. సమన్వయ లోపం..

Published Wed, Mar 12 2025 9:06 AM | Last Updated on Wed, Mar 12 2025 9:06 AM

అలసత్వం.. సమన్వయ లోపం..

అలసత్వం.. సమన్వయ లోపం..

నరేందర్‌రెడ్డి ఓటమికి కారణాలివే..
● ఉమ్మడి మెదక్‌లోనే అతి తక్కువ ఓట్లు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సుదీర్ఘ చర్చ ● ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో సమావేశమైన జిల్లా మంత్రులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఓటమికి గల కారణాలపై ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్సీ సీటు చేజారి పోవడానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. ఈ ఓటమికి అభ్యర్థి నరేందర్‌రెడ్డి అలసత్వమే కారణమని పలువురు జిల్లా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, కీలక నాయకులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అభ్యర్థి నరేందర్‌రెడ్డి అలసత్వం కారణంగానే జిల్లాలో ఆశించిన ఓట్లు పడలేదని పలు నియోజకవర్గాల నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్థి ఎంపిక కూడా మరోకారణమని, హరికృష్ణకు టికెట్‌ ఇస్తే ప్రయోజనం ఉండేదని, మరోవైపు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడం కూడా కారణమని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి చివరలో హాజరైన పీసీసీ చీఫ్‌ బి.మహేష్‌కుమార్‌గౌడ్‌తో కూడా ఈ అంశంపై జిల్లా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది.

పాత బిల్లులు క్లియర్‌ చేయండి

త్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్‌డీఎఫ్‌)లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే గతంలో మంజూరైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని, ఒకరిద్దరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోల్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఎందుకంత వ్యతిరేకత వస్తోందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement