యూరియా
పక్కదారి పట్టవద్దనే..
● రైతులకు ‘యాప్’సోపాలు..
● సాంకేతిక సమస్యలతో సతమతం
డివిజన్‌లో
పంటల సాగు ఇలా..
పంట ఎకరాలు
వరి 62,100
మక్క 3850
పత్తి 25,750
కంది 1728
ఇతర 850
మొత్తం 94,278
హుస్నాబాద్‌రూరల్: పల్లె రైతుకు యూరియా కష్టాలు వీడటంలేదు. ఎరువులు పక్కదారి పట్టవద్దని యాప్ తీసుకువస్తే గ్రామీణ రైతులకు సమస్యలు వచ్చి పడ్డాయి. నెట్ వర్క్ సమస్యతో యాప్‌లో ఎరువులను బుక్ చేయాలంటే కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. ఓటీపీని యాప్‌లో ఎంటర్ చేసే సమయానికే సాంకేతిక సమస్యలతో బుక్ కావడం లేదు. మరోవైపు 3 నిమిషాల్లోపే యూరియా నిల్వలు ఖాళీ అవుతున్నాయి.
హుస్నాబాద్ డివిజన్‌లో కోహెడ, హుస్నాబాద్, బెజ్జంకి, అక్కన్నపేట మండలాల్లో 94,278 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. డివిజన్‌లో ఇప్పటి వరకు 8,283 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో రైతు వరి పంట వేసింది మొదలు ఇప్పటి వరకు ఒక్క యూరియా బస్తా కూడా బుక్ చేసుకోలేని పరిస్థితి. కొందరు వ్యాపారులు బీనామి రైతుల పేర్లపై యాప్ బుక్ చేసి బస్తాలను ఇస్తున్నారు. పంటలు సాగు చేయని భూముల సర్వే నంబర్ల పై యాప్‌లో బస్తాలను బుక్ చేయడం వలన పంటలు సాగు చేసిన వారికి యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల దాటినా ఎరువు కరువే..
వరి పంటలకు నెల దాటినా ఎరువు వేద్దామంటే రైతులకు బస్తాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల వాట్సప్ గ్రూప్‌ల్లో రాత్రి వేళ యూరియా వస్తుందని పోస్టులు పెట్టగానే ఉదయమే రైతులు స్మార్టు ఫోన్లు పట్టుకొని ఎరువుల దుకాణం పరుగు తీయడం.. యూరియా లభించకపోవడంతో నిరాశతో ఇంటికి చేరడం నిత్యకృత్యంగా మారింది. పంటలకు సమయానికి ఎరువు వేయకపోతే పైరులో పెరుగుదల లోపించి దిగుబడులు తగ్గే అవకాశం ఉందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పల్లె రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యూరియా పక్కదారి పట్టవద్దని, దుకాణాల వద్ద రైతులు క్యూలైన్లు కనిపించవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం యాప్ ద్వారా పంపిణీ చేస్తోంది. చాలా మంది యాప్ ద్వారానే యూరియా తీసుకెళ్తున్నారు. కొందరి రైతులకు ఇబ్బందులు ఉండవచ్చు. సాంకేతిక లోపం అనేది నెట్ వర్క్ సమస్య.
–వీణారెడ్డి, ఏడీఏ, హుస్నాబాద్


