
బందారంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్
కొండపాక(గజ్వేల్): పేదల భూములను గుంజుకున్న సీఎం కేసీఆర్‌ను సాగనంపాలని మాజీ మంత్రి, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కొండపాక మండలంలోని బందారం, అంకిరెడ్డిపల్లి, దుద్దెడ, రాంపల్లి, మర్పడ్గ, ఖమ్మంపల్లి, సిర్సనగండ్ల, కొండపాక, దమ్మక్కపల్లి, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతినేలా పనిచేయడంతో పాటు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. పేదలను భయభ్రాంతులకు గురి చేస్తూ తక్కువ ధరలకు వేలాది ఎకరాల భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ బడా వ్యాపారులకు కట్టబెడుతూ రూ.వేల కోట్లు గడిస్తున్నారన్నారు. అన్యాయం అణచివేత, అక్రమాలు చేయడం సీఎం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారిస్తూ పేదల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. కూలీ నాలీ చేసుకుంటున్న కుంటుంబాల పిల్లలు హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం కోచింగ్‌లు తీసుకుంటుంటే పేపరు లీకేజీల కారణంగా ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఒక్కసారి ఆలోచాంచాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, వడ్డీలేని రుణాలు అందించే బాధ్యత తనదంటూ కచ్చితమైన హామీ నిచ్చారు. దుద్దెడలోని ఆరుగురు వార్డు సభ్యులతో వివిధ గ్రామాల్లోని యువత బీజేపీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు నలగామ శ్రీనివాస్, నంద కుమార్, బైరీ శంకర్, గురువారెడ్డి, రామస్వామి, శేరి నరేందర్ పాల్గొన్నారు.
యువత భవిష్యత్‌ను నాశనం చేసిన సర్కార్
గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
పార్టీలోకి భారీగా చేరికలు