అభివృద్ధిలో గజ్వేల్‌ నంబర్‌వన్‌

శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు,  ప్రతాప్‌రెడ్డి, రోజాశ ర్మ తదితరులు - Sakshi

బస్‌బేల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన

గజ్వేల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతోనే గజ్వేల్‌ అభివృద్ధిలో నంబర్‌వన్‌గా మారుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు అన్నా రు. బుధవారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పక్కన రూ.2.51 కోట్లతో నిర్మించతలపెట్టిన బస్‌బే, ప్రజ్ఞాపూర్‌ చౌరస్తాలో రూ.3.81కోట్లతో నిర్మించతలపెట్టిన మరో బస్‌బే నిర్మాణాలకు టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం ప్రాతినిధ్యం గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. ఈ ప్రాంతం ఇప్పటికే ఎన్నో భారీ అభివృద్ధి పనులకు నెలవుగా మారిందన్నారు. ప్రత్యేకించి మున్సిపాలిటీ పరిధిలో కొన్నేళ్లుగా బస్టాండ్ల వ్యవహారం పెండింగ్‌లో ఉండగా, తాజాగా తూప్రాన్‌ రోడ్డువైపున ఒకటి, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌లలో కలుపుకొని మూడు బస్టాండ్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. దీనివల్ల ప్రజల చిరకాల కోరిక నెరవేరి మున్సిపాలిటీ మరింత వేగంగా విస్తరించడానికి బాటలు పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వంపై బురదచల్లడం మానుకోక పోతే పుట్టగతులుండవని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయొద్ధీన్‌, జెడ్పీటీసీ మల్లేశం, రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు దేవీ రవీందర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఆర్టీసీ డీఎం సురేఖ పాల్గొన్నారు.

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top