ఇందిరమ్మ బీమాకు
●నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ●ఇంటి కుటుంబ పెద్దకు ధీమా
సంగారెడ్డి జోన్/జహీరాబాద్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సమయం ఆసన్నమైంది. గురువారం సిద్దిపేటలో నిర్వహించనున్న సభలో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా పథకాన్ని ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం రైతులకు మాత్రమే బీమా పథకాన్ని అమలు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటి కుటుంబ పెద్దకు జీవిత బీమా కల్పించాలని నిర్ణయించింది. రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా కల్పించేందుకు వీలుగా గత ప్రభుత్వం రైతు బీమాను అమలు చేసింది. 2018 ఆగస్టు 15వ తేదీన పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయి తే ఆగస్టులో రైతు బీమా పథకాన్ని రెన్యువల్ చేయకుండా నిలిపివేసింది. అప్పటి నుంచి మరణించిన రైతులకు బీమా వర్తించకుండా పోయింది. గతంలో రైతు వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఇప్పటి ప్రభుత్వం కూడా వయసును దీనినే పరిగణలోకి తీసుకుంది. ప్రీమియం సైతం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. బీమా సొమ్ము రూ.5 లక్షలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది.
అర్హత.. నిబంధనలు
● దరఖాస్తుదారులు రాష్ట్ర శాశ్వత నివాసులై ఉండాలి.
● ఆదాయ, కుల, మత బేధాలు లేకుండా అర్హత కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
● కుటుంబంలో ఎవరికి బీమా చేయించాలి, ఎవరిని నామినీగా పెట్టాలనే విషయాన్ని కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు.
దరఖాస్తు విధానం ఇలా..
● గురువారం నుంచి ప్రారంభం అయ్యే నమోదు ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రత్యేక దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది.
● అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి అన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
● దరఖాస్తులో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
● జిల్లా, నియోజకవర్గం, గ్రామం, మండలం లేదా పట్టణం, వార్డు, కోడ్‌లు, ఇంటి నంబర్‌ను దరఖాస్తులో పొందుపర్చాలి.
● రేషన్ కార్డు నంబరు, కులం, మతం, వివరాలను కోడ్‌ల రూపంలో నమోదు చేయాల్సి ఉంటుంది.
● బీమా చేయించుకునే కుటుంబ పెద్ద పేరు, తండ్రి/భర్త పేరు, పుట్టిన తేదీ నమోదు చేయాలి.
● ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా చేర్చాలి. మొబైల్ నంబర్‌తో పాటు మిగిలిన కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు నమోదు చేయాలి.
నామినీ వివరాలు
బీమా మొత్తాన్ని పొందే నామినీ పేరు, క్లెయిమ్ వాటా శాతం పేర్కొనాలి. ఒక వేళ నామినీ మైనర్ (18 ఏళ్ల లోపు) అయితే, వారికి సంరక్షకుడిగా ఉండే అపాయింటీ పేరు, ఆధార్ నంబర్, సంతకం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.


