నీటి సమస్య పరిష్కరిస్తాం
● నిరుపయోగంగా వాటర్ ట్యాంకులు
● పట్టించుకోని అధికారులు
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమయంలో తాగు నీటి కోసం పాఠశాలల సమీపంలోని ఇళ్లు, చుట్టుపక్కల వాటర్ ట్యాంకులు, బోర్ల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మండలంలో 48 ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దౌల్తాబాద్, మల్కాపూర్‌తో పాటు పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నీటి సౌకర్యం లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని పాఠశాలలకు మిషన్ భగీరథ, రక్షిత మంచినీటి ట్యాంకుల ద్వారా పైపులు వేసి మినీ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కానీ పైపులైన్లు పగిలిపోయి, మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం టిఫిన్ చేసి చేతులు శుభ్రం చేసుకోవడానికి, తాగడానికి ఇంటి నుంచి వాటర్ బాటిళ్లలో తెచ్చుకున్న నీరు అయిపోతున్నాయి. మధ్యాహ్న భోజనం చేసే సమయంలో పాఠశాలలో తాగునీరు లేక తల్లడిల్లుతున్నారు. టిఫిన్ భోజనం అందిస్తున్న అధికారులు నీటి సౌకర్యం కూడా అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరుగుదొడ్లలో కూడా నీరు లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దౌల్తాబాద్ పాఠశాలలో నీరు లేక సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద పాత్రలు శుభ్రం చేస్తున్న విద్యార్థులు, నిరుపయోగంగా దర్శనమిస్తున్న మినీ వాటర్‌ట్యాంక్
మండలంలోని పలు గ్రామాల ప్రాథమిక పాఠశాలల్లో నీటి సమస్య ఉందని తమ దృష్టికి వచ్చింది. విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించేందుకు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా.
– వెంకట్ నరసింహగౌడ్, ఎంఈఓ


