సాక్షి, సిద్దిపేట: కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట వేదికగా గురువారం శ్రీకారం చుట్టనున్నారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించే సభలో సీఎం ప్రసంగించనున్నారు. ర్యాలీ, సభ నేపథ్యంలో ఐజీ కార్తికేయ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సంక్షేమ పథకానికి సిద్దిపేటను వేదికగా ఎంచుకోవడం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
ర్యాలీగా సభాస్థలికి..
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటకు సాయంత్రం చేరుకోనున్నారు. డిగ్రీ కళాశాల మైదానం నుంచి ముస్తాబాద్ చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తారు. తర్వాత అక్కడి నుంచి బహిరంగ సభకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా 2,500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. సీఎం కాన్వయ్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు.
రెండు యంగ్ ఇండియా స్కూళ్లు మంజూరు
జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రభు త్వం మంజూరు చేసింది. హుస్నాబాద్‌లో వేగంగా యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం అవుతోంది. మంజూరైన వాటికి గురువారం సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
సభపై రాజకీయ వర్గాల చూపు
రాజకీయంగా కీలకమైన జిల్లా కావడంతో సిద్దిపే టలో సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏయే అంశాలను ప్రస్తావిస్తారు? ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కా ర్యక్రమాలపై ఎలాంటి సందేశం ఇస్తారు? జిల్లాకు సంబంధించి ఏమైనా కొత్త హామీలు ఇస్తారా? అనే చర్చ సాగుతోంది.


