చెరుకు రైతుకు క్రషింగ్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

చెరుకు రైతుకు క్రషింగ్‌ కష్టాలు

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

● సంగారెడ్డిలో తప్పని ఎదురుచూపులు

● చెరుకు నరికేందుకు వచ్చిన కూలీలు వెళ్లిపోతారని ఆందోళన

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చక్కెర కర్మాగారాల్లో చెరుకు క్రషింగ్‌ ప్రారంభమై పక్షం రోజులు గడుస్తోంది. కానీ సంగారెడ్డిలోని గణపతి షుగర్‌ ఫ్యాక్టరీలో మాత్రం ఇంకా షురూ కాలేదు. దీంతో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరుకును నరికేందుకు చాలా మంది రైతులు రూ.వేలల్లో అడ్వాన్సులు ఇచ్చి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను మాట్లాడుకున్నారు. క్రషింగ్‌ షురూ కాకపోవడంతో వచ్చిన కూలీలు వెళ్లిపోతామని చెబుతున్నారు. కాగా గతేడాది నవంబర్‌ మొదటి వారంలోనే క్రషింగ్‌ ప్రారంభించారు. మరోవైపు రాయికోడ్‌లో ఉన్న మరో షుగర్‌ ఫ్యాక్టరీ కూడా క్రషింగ్‌ ప్రారంభించి దాదాపు 20 రోజులు దాటింది. ఇప్పటి వరకు సుమారు 22 వేల మెట్రిక్‌ టన్నుల చెరుకు క్రషింగ్‌ జరిగింది. మాగి, కోత్తకోటల్లోని షుగర్‌ ఫ్యాక్టరీలు కూడా సుమారు 50 వేల మెట్రిక్‌ టన్నుల చెరుకు క్రషింగ్‌ చేసింది. కానీ సంగారెడ్డిలోని ఫ్యాక్టరీ మాత్రం ఇంకా శ్రీకారం చుట్టలేదు. దీంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. కాగా గణపతి షుగర్స్‌ ఫ్యాక్టరీ పరిధిలో 9,765 ఎకరాల్లో రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. సంగారెడ్డితో పాటు, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో ఈ పంట సాగవుతోంది. ఈసారి సుమారు 2.75 లక్షల మెట్రిక్‌ టన్నుల చెరుకు క్రషింగ్‌ జరుగుతుందని కేన్‌ కమిషనరేట్‌ అంచనా వేసింది.

ధరపై రైతుల పట్టు

పెరిగిన సాగు వ్యయాన్ని దృష్టిలో ఉంచి చెరుకు ధరను పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ధర టన్నుకు రూ.3,985లు ఏమాత్రం సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం టన్నుకు రూ.ఐదు వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు భారతీయ కిసాన్‌సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు పర్వతగారి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. మూడు, నాలుగు నెలల పంట కాలం ఉన్న పసుపు, సోయా, జొన్న వంటి అన్ని పంటలకు ధర పెరిగినప్పటికీ.. ఏడాదంతా కష్టం చేసిన పండించే చెరుకు ధర పెరగకపోవడం పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. ధర పెంచకపోతే వచ్చే ఏడాది నుంచి ఈ పంట సాగుకు స్వస్తి చెప్పే అవకాశాలున్నాయని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు చక్కెర ధర కూడా భారీగా పెరిగింది. అయినప్పటికీ యా జమాన్యాలు చెరుకు ధరను పెంచకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగులు కూడా తమ వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మె నోటీసులు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే చిన్న చిన్న మరమ్మతులు చివరి దశకు చేరాయని, ఒకటీ రెండు రోజుల్లో క్రషింగ్‌ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement