ఎకరాపై రూ.2 లక్షలకు పైగా నష్టం కాపాడుకునే ప్రయత్నంలో అన్నదాతలు ఖరీదైన మందుల పిచికారీ
అనుకూలించని వాతావరణంతో దెబ్బతిన్న పంటలు
జహీరాబాద్: ఆశాజనకంగా కనిపించిన అల్లం పంటలు తెగుళ్లతో నిట్ట నిలువునా మాడిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోనే జహీరాబాద్, కోహీర్ మండలాల్లో అల్లం పంటలు అధికంగా సాగువుతున్నాయి. ఆయా మండలాల్లో సుమారు 2,500 ఎకరాల్లో అల్లం పంట సాగయింది. వీటిలో 40 శాతం మేర పంటలు దెబ్బతిన్నట్లు రైతులు వివరిస్తున్నారు. భూమిలో అల్లం పంట ఎదగకముందే పైభాగంలో ఉండే ఆకులు, కాండం ఎండిపోయి దెబ్బతింటున్నాయి. పంటను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు ఖరీదైన మందులు పిచికారీ చేసే ప్రయ త్నం చేస్తున్నారు. అయినా ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు. జూన్‌లో సాగు చేసిన అల్లం పంట డిసెంబర్– జనవరిలో పక్వానికి వస్తుంది. ప్రస్తుతం పక్వానికి రాక ముందే మాడిపోతుండడంతో పంటను తీసుకునే అవకాశం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త తెగులుగా అనుమానం
గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లం పంటలు మాడిపోతుండడం చూస్తుంటే కొత్తగా వచ్చిన తెగుళ్లుగా రైతులు అనుమానిస్తున్నారు. అగ్గి తెగులు పోలికతో ఉన్నట్లు చెబుతున్నారు. పక్కనే ఉన్న కర్ణాటకతో పాటు కేరళలో ఇప్పటికే అల్లం పంటలు ఈ తెగుళ్ల బారిన పడినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కేరళలోని ఇండియన్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ కేంద్రం వారు శిలీంద్రం ప్రాక్జిపైరీక్యులేరియా జిన్జమెరిస్‌గా నిర్ధారించారు. వచ్చే సీజన్‌కు గాను తెగుళ్లు సోకిన విత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో విత్తుకోవద్దని వారు రైతులకు సూచిస్తున్నారు.
భారీగా పెట్టుబడులు
అల్లం పంట సాగుపై రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎకరా సాగుపై సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. పశువుల ఎరువులు, విత్తనం, పురుగు మందులు, దుక్కి దున్నకం, అంతర కృషి చేసేందుకు గాను పెట్టుబడులు పెట్టారు. పంట దెబ్బతిన్న రైతులు మాత్రం పెట్టుబడులను పూర్తిగా కోల్పోయారు. ఆశాజనకంగా ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఖరీదైన మందులు పిచికారీ చేస్తున్నారు.


