మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
తూప్రాన్: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తూప్రాన్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఐజీ, కార్యాలయ ప్రాంగణంలో ‘మియాజాకి’ రకానికి చెందిన మామిడి మొక్కను నాటి కార్యాలయంలోని పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. ప్రతి కేసులోనూ నిర్దేశిత ఎస్ఓపీలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. డీఎస్పీలు సైతం ప్రతీ నెల తమ డివిజన్ పరిధిలో కనీసం రెండు పోలీస్స్టేషన్లను తనిఖీ చేయాలన్నారు. గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.


