కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జోన్: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించి, ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రి చికిత్స, భరోసాతో కూడిన వైద్య సేవలు అందించాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్సకు దూరం కాకుండా, వారికి తక్షణమే అవసరమైన వైద్య సేవలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పథకం నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత ఆసుపత్రుల్లో చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, తదితరులు పాల్గొన్నారు.


