పటాన్చెరు టౌన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో కలిసి జాతీయ రహదారి 65పై పటాన్చెరు నుంచి దిగ్వాల్ చౌరస్తా వరకు ప్రమాద ప్రాంతాలను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను మెరుగు పరచాలన్నారు. పటాన్చెరు బస్టాప్ వద్ద పాదాచారుల వంతెన, కంది చౌరస్తాలో విద్యుద్దీపాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు, వేగ నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, పోలీసు, రవాణా, వైద్య, రహదారుల శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


