సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 13 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు తేలింది. రెండు మండలాల్లో తీవ్ర కరువు నెలకొనగా., 11 మండలాల్లో మధ్యస్తంగా కరువు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వర్షపాతం రికార్డులు.. డ్రైస్పెల్‌ల నమోదు.. ఎండిపోయిన పంటల విస్తీర్ణం.. పడిపోయిన దిగుబడుల ఆధారంగా ఈ కరువు మండలాలను ఎంపిక చేశారు. ఈ మండలాల్లో సుమారు 50 శాతానికి పైగా పంటలు నష్టపోయినట్లు తేలింది. దీంతో ఈ మండలాలను కరువు మండలాలు ప్రతిపాదించారు. ఝరాసంఘం, నాగల్‌గిద్ద, సదాశివపేట, వట్‌పల్లి, కంది, సంగారెడ్డి, రామచంద్రాపురం, కంగ్టి, కొండాపూర్, సిర్గాపూర్, నారాయణఖేడ్, నిజాంపేట మండలాలలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రతిపాదనలు వెళ్లాయి.
హత్నూర(సంగారెడ్డి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు ఉద్యమం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు అన్నారు. శుక్రవారం మండలంలోని దౌల్తాబాద్‌లో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 42,000గా నిర్ణయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కోరారు. ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు షబ్బీర్, వీరేశం, కార్మికులు బాలరాజ్, సుధాకర్, శ్రీనివాస్, యాదగిరి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల దొంగతనం జరుగుతుందని, తొలగించిన ఓట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు దుర్గా, కవిత, అశోక్, శంకర్, రాములు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): భూ రీ సర్వేను వేగవంతం చేయాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కాస్లాపూర్‌లో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గ్రామంలో 220 ఎకరాలు రీ సర్వే చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహిస్తున్న రీ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఆర్‌ఐ, జీపీఓ, సర్వేయర్లు పాల్గొన్నారు.
చేగుంట(తూప్రాన్): మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలను పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. శుక్రవారం మండలంలోని రెడ్డిపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఇళ్ల నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 9 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవడంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి విడత లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుంటే రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్రామానికి రెండో విడత ఇళ్ల నిర్మాణాలు మంజూరైనట్లు, వాటిని త్వరలోనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఏఈ రియాజొద్దీన్, కార్యదర్శి సుల్తానా గ్రామస్తులు ఉన్నారు.


