సంగారెడ్డి టౌన్: పట్టణ శివారు వైకుంఠపురంలోని వెంకటేశ్వర స్వామిని శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజన ర్సింహ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. మంత్రి వెంట ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఆస్పత్రిని ప్రారంభించండి
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మంత్రి వివేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదని తెలిపారు.
రైతులకు రెండు రోజుల శిక్షణ
జహీరాబాద్: ఉద్యాన పంటల కోతలు, అనంతరం అనుసరించాల్సిన విధానాలపై రైతులకు ఈనెల 27, 28వ తేదీల్లో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ లోని డీడీఎస్– కేవీకే శాస్త్రవేత్త శైలజ తెలిపారు. అరటి, మామిడి, జామ, సపోటా, పుచ్చకాయ, అల్లం, కూరగాయల సాగు, పంటలలో కోత తర్వాత వచ్చే నష్టాలను తగ్గించి, అధిక ఆదాయం పొందే మెళకువలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సంగారెడ్డిలోని పండ్ల పరిశోధన స్థానం, హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హాజరవుతారని వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవీకేలో శిక్షణ తరగతులు కొనసాగుతాయని, రిజిస్ట్రేషన్ కోసం రైతులు 81790883 47 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
పటాన్‌చెరు టౌన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–2) పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గీతం విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పాండు తనిఖీ చేశారు. అభ్యర్థుల హాజరు, వేలిముద్రల నమోదు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరమే కేంద్రంలోకి అనుమతించాలని సిబ్బందికి సూచించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 150 మంది అభ్యర్థులకు 89 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
టీజీఎంఎస్ బొల్లారానికి అరుదైన గుర్తింపు
జిన్నారం(పటాన్‌చెరు): బొల్లారం ఆదర్శ పాఠశాల యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు జేఈఈ ఎప్‌సెట్, నీట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ప్రారంభించనున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలోనే విద్యార్థులకు పోటీ పరీక్షలపై పట్టు సాధించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. దీని వల్ల ఇంజనీరింగ్, వైద్య విద్యలో ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.


