ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

● వచ్చే నెల 1 లోపు కేంద్రాలు ప్రారంభం

● జిల్లాలో 227 సెంటర్ల ద్వారా సేకరణ

● వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు

సంగారెడ్డి జోన్‌: వానాకాలం సీజన్‌లో సాగు చేసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 227 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్టోబర్‌ 1 లోపు ప్రారంభించి కొనుగోలు చేసే దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునే రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంది.

వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1,65,000 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎల్‌నినో ప్రభావంతో సుమారు 40,000 ఎకరాలు విస్తీర్ణం తగ్గి, లక్ష 20 వేల ఎకరాలకు పైగా వరి సాగైనట్లు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 227 కేంద్రాలను గుర్తించారు. అందులో 196 దొడ్డు రకం, 31 సన్నరకం ధాన్యానికి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 97, పీఏసీఎస్‌ 97, డీసీఎంఎస్‌ 31, ఎఫ్‌పీఓ, మెప్మా ఆధ్వర్యంలో ఒకటి చొప్పున ప్రారంభించనున్నారు. ఏటా సుమారు 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేవారు. ఈ సంవత్సరం సాగు తగ్గడంతో 1.65 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించే అవకాశం ఉంది.

టోకెన్‌ విధానం అమలు

రైతులు పండించిన పంట పారదర్శకంగా పక్కదారి పట్టకుండా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాగానే రిజిస్టర్‌లో నమోదు చేసుకొని టోకెన్‌ అందించనున్నారు. తేమశాతం పరిశీలించి కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 3,348 టార్పాలిన్లు, 2 ఆటోమేటిక్‌ ప్యాడీ క్లీనర్లు, 37 గ్రెయిన్‌ కాలిపర్లు, 252 తేమ కొలిచే యంత్రాలు, 276 ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు, 35 హస్క్‌ రిమూవర్లు, 2 డ్రైయర్లను కేంద్రాల్లో ఉంచుతున్నారు. అలాగే ధాన్యం రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాలకు జీపీఎస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

నిర్ధారణకు టెక్నికల్‌ అసిస్టెంట్లు

ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న రకం ధాన్యానికి మాత్రమే బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన రకం నిర్ధారించేందుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలలో టెక్నికల్‌ అసిస్టెంట్‌లను నియమించనుంది. సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,441, గ్రేడ్‌–ఏ రకానికి రూ.2,461 మద్దతు ధర ఉండగా, అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్‌ వర్తిస్తుంది. దీంతో సన్న రకం గ్రేడ్‌–ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,961 వరకు లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement