వేసవి గడిచేదెలా? | - | Sakshi
Sakshi News home page

వేసవి గడిచేదెలా?

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

పాపన్నపేట(మెదక్‌): మెతుకుసీమకు తాగు నీటి గండం తరుముకొస్తుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు..సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు మిషన్‌ భగీరథకు గండంగా మారాయి. సింగూరులో రోజు రోజుకు అడుగంటుతున్న నీళ్లు, 6.78 లక్షల ప్రజల కన్నీళ్లకు కారణమవు తు న్నాయి. కాగా, రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు రూ.28.67 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు.

మిషన్‌ భగీరథకు గండం

సింగూరులో 2016లో ప్రారంభించిన మిషన్‌ భగీరథ ద్వారా హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలోని గ్రామాలకు తాగు నీరు అందుతుంది. సింగూరు ప్రాజెక్టు నిల్వనీటి సామర్థ్యం 29 టీఎంసీలు కాగా, 4 టీఎంసీలు తాగు నీటికి కేటాయించారు. రాయిపాడ్‌ వద్ద నిర్మించిన భారీ ట్యాంక్‌ ద్వారా మెదక్‌ జిల్లాలోని 916 హాబిటేషన్‌లకు తాగు నీరు అందుతుంది. 6,77,956 మందికి రోజుకు 67 ఎంఎల్‌టీల నీరు అందిస్తోంది. ఇందుకోసం జిల్లాలో 1,492 ఏహెచ్‌ఎస్‌ఆర్‌లను వినియోగిస్తున్నారు. అయితే వర్షాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు, ప్రాజెక్టుకు మరమ్మతులు ప్రారంభించడంతో సింగూరు నీటిని ఖాళీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 4.054 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఇవే పరిస్థితులు కొనసాగితే మరో రెండు నెలల తర్వాత తాగు నీరు ఇవ్వని పరిస్థితి నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు.

రూ.28.67 కోట్లతో కార్యాచరణ

వేసవిలో పొంచి ఉన్న తాగు నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని, మిషన్‌ భగీరథ అధికారులు రూ.28.67 కోట్ల వ్యయంతో ప్రత్యామ్నాయ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పంపు సెట్ల ఏర్పాటు, బోర్‌వెల్‌లు, పైప్‌లైన్‌, పంచాయతీ ట్యాంకర్ల ఇంధనం, రవాణ చార్జీల కోసం సుమారు రూ.21.10 కోట్లు, బోర్ల అద్దెకు రూ.1.31 కోట్లు, ట్రాన్స్‌పోర్టేషన్‌కు రూ.6.26 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. కాగా, జిల్లాలో సింగిల్‌ ఫేజ్‌ మోటార్లు 2,637, త్రీఫేజ్‌ మోటార్లు 1,042, హ్యాండ్‌ పంప్‌లు 127 పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

తరుముకొస్తున్న తాగు నీటి గండం

రోజుకు 67 ఎంఎల్‌టీల నీరు అవసరం

916 గ్రామాలు.. 6.78 లక్షల ప్రజలకు తిప్పలు

ప్రత్యామ్నాయ చర్యలు

మరో రెండు నెలల్లో తాగు నీటి ఎద్దడి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకునుగుణంగా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నాం. శనివారం అధికారులతో సమావేశం జరిగింది. మొదట శంకరంపేట (ఏ), నారాయణఖేడ్‌, మెదక్‌ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ప్రభావం కనిపించనుంది. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం.

– సంపత్‌ కుమార్‌, మిషన్‌ భగీరథ ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement