చెత్తకు నిప్పు.. ఏదీ కనువిప్పు? | - | Sakshi
Sakshi News home page

చెత్తకు నిప్పు.. ఏదీ కనువిప్పు?

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

సంగారెడ్డి: గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా పేరున్న సంగారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో అసంతప్తి వ్యక్తమవుతోంది. పట్టణంలోని పలు కాలనీల్లో చెత్త కుప్పలు, మురుగు కాలువలు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 38 వార్డుల్లో పలు ప్రాంతాల్లో దోమలు, ఈగలు, పందుల బెడద పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 50 టన్నుల చెత్త సేకరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశుభ్రత కనిపించడం లేదని వాపోతున్నారు. చెత్త సక్రమంగా తరలించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే నిప్పంటిస్తున్నారని చెబుతున్నారు. కొత్త బస్టాండ్‌ ఆవరణ, చౌరస్తా ప్రాంతాలు, బొబ్బిలికుంట తదితర ప్రాంతాల్లో చెత్త దహనం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాల్చడం వల్ల దట్టమైన పొగ వెలువడి పరిసరాలను కమ్మేస్తోందని వాపోతున్నారు.

అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం

పట్టణంలోని కొన్ని కాలనీల్లో చెత్త సేకరణ, మురుగు కాలువల నిర్వహణ సక్రమంగా లేదనే విమర్శలు ఉన్నాయి. చెత్త కుప్పలు రోజుల తరబడి తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోందని ప్రజలు చెబుతున్నారు. మురుగు నీరు నిలిచే ప్రాంతాల్లో దోమల బెడద పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరుతున్నారు. చెత్త దహనాన్ని పూర్తిగా అరికట్టి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలని కోరుతున్నారు.

పీసీబీ, మున్సిపల్‌ అధికారులపై విమర్శలు

బహిరంగంగా చెత్త దహనం జరుగుతున్నా సంబంధిత అధికారులు తగిన స్థాయిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్‌ అధికారులు చెత్త సేకరణ, తరలింపు వ్యవస్థను మరింత పటిష్టం చేసి కాలనీల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంగారెడ్డిలో కంపు కొడుతున్న కాలనీలు

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

రోజు 50 టన్నుల చెత్త సేకరణ.. అయినా కనిపించని పరిశుభ్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement