● ఆందోళనలో అన్నదాతలు
● ఎండుముఖం పట్టిన పంటలు
జహీరాబాద్ టౌన్: ఈసారి వానలు ముఖం చాటేయడంతో భూగర్భజలాలు క్రమంగా పడిపోతున్నాయి. ఉన్న నీటితో పంటను కాపాడుకుందామంటే కరెంట్ కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. బోరు బావుల కింద పంటలు సాగు చేయడంతో కరెంట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఎండల తీవ్రతతో పాటు లోడ్ ఎక్కువకావడంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో బోరు మోటార్లు కాలిపోతున్నాయి. ఇప్పటికే పంటల కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు, ఇప్పుడు మోటార్ల మరమ్మతుల కోసం వేలాది రూపాయాలు ఖర్చుచేయాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు.
25 వేల వరకు బోరు కనెక్షన్లు
జహీరాబాద్ నియోజకవర్గంలో అధిక శాతం రైతులు చెరకు, అల్లం, ఆలుగడ్డ, కూరగాయలు, పండ్ల తోటలు తదితర పంటలను బోరుబావుల ఆధారంగా సాగు చేస్తుంటారు. నియోజకవర్గంలో సుమారు 25 వేల వరకు బోరు మోటార్ల కనెక్షన్లు ఉన్నాయి. పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు నిరంతరం మోటార్లను నడపాల్సి వస్తుంది. అయితే లో వోల్టేజీ, కరెంట్ హెచ్చుతగ్గులతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నిరంతరాయంగా కరెంట్ సరఫరా లేకపోవడంతో పాటు ఆటో స్టార్టర్ల వల్ల మోటార్లు ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఎక్కువ లోడు పడుతోంది. మూడు ఫేజ్‌లలో ఒక్కోసారి ఏ ఒక్క ఫేజ్ కట్ అయినా మోటార్లు కాలిపోతున్నాయి. ఒక్కసారి మోటారు కాలిపోతే రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి నా ణ్యమైన కరెంట్ నిరంతరం సరఫరా చేయాలని కోరుతున్నారు.


