సంగారెడ్డి టౌన్: కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 24,321 మందికి గాను 23,972 మంది హాజరయ్యారని అదనపు డీఆర్డీఓ సూర్యారావు తెలిపారు. 23 మండలాల్లో 558 సెంటర్లలో పరీక్ష నిర్వహించామన్నారు. 18 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాసులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ముఖ్య ఉద్దేశం అన్నారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ త్వరలో సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రైతుల సమస్యలు నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
తూప్రాన్: ప్రాథమిక విద్య పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, జీఓ 25 సవరణ కోసం సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఓగార్డెన్‌లో ఎస్జీటీయూ తెలంగాణ రాష్ట్రస్థాయి సమావేశం రాష్ట్ర నిర్వహించారు. ఈసందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్సీలో ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, వ్యవస్థాపక అధ్యక్షుడు సంకినేని మధుసూదన్‌రావు, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, అదనపు కార్యదర్శి పండుగ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం ఆదివారం వేలాది భక్తులతో జనసంద్రంగా మారింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు దుర్గమ్మకు ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఘనపురం ప్రాజెక్టులో వినాయకుల నిమజ్జనం కోసం వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.


