సంగారెడ్డి జోన్: ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటల కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలుకు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 257 వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దొడ్డు రకం ధాన్యానికి 196, సన్న రకం ధాన్యానికి 31 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అక్టోబర్ 1లోగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాగానే రిజిస్టర్లు నమోదు చేసి టోకెన్ జారీ చేయాలన్నారు. టోకెన్ విధానాన్ని పూర్తిగా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. 3,348 టార్పాలిన్లు, 2 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, 37 గ్రెయిన్ కాలిపర్లు, 252 తేమ కొలిచే యంత్రాలు, 276 ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, 35 హస్క్ రిమూవర్లు, 2 డ్రైయర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. అవసరమైన చోట వీటిని అందుబాటులో ఉంచి కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బాలసరోజ, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంగీత


