24 జిన్నింగ్‌ మిల్లులు నోటిఫై | - | Sakshi
Sakshi News home page

24 జిన్నింగ్‌ మిల్లులు నోటిఫై

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పత్తి కొనుగోళ్లకు సీసీఐ (కాటాన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సన్నాహాలు చేస్తోంది. పది రోజుల్లో ప్రారంభం కానున్న కొనుగోలు సీజన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 23 జిన్నింగ్‌ మిల్లులను లీజుకు తీసుకుంది. మరో జిన్నింగ్‌ను కూడా నోటిఫై చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈసారి కొత్తగా జహీరాబాద్‌లో కూడా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతేడాది రాయికోడ్‌, సదాశివపేట, నారాయణఖేడ్‌, వట్‌పల్లి, జోగిపేట్‌లో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఈసారి అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏటా రైతులు అక్టోబర్‌ మొదటి వారం నుంచి పత్తి తీయడం ప్రారంభిస్తారు. రెండో వారం నుంచి పత్తి మార్కెట్‌లోకి విక్రయానికి వస్తుంది. ఈలోగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. ఈ కేంద్రాలు లేని పక్షంలో వ్యాపారులు, దళారులు ధరలో కోత విధించి రైతు నిండా ముంచడం పరిపాటవుతుంది.

కపాస్‌ కిసాన్‌ యాప్‌తో..

సీసీఐ పత్తి కొనుగోళ్లకు కపాస్‌ కిసాన్‌ యాప్‌ను తీసుకురావడంతో ప్రారంభంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు ఈ యాప్‌పై సరైన అవగాహన లేక, స్మార్ట్‌ఫోన్లు లేక స్లాట్‌ బుకింగ్‌లో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు క్రాప్‌ బుకింగ్‌లో పత్తి సాగు చేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో రైతులు సీసీఐకి పంటను విక్రయించలేకపోయారు. దీంతో తాత్కాలిక నమోదు కోసం వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈసారి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెబుతున్నారు. ఇకపై టీపీలు కూడా ఆన్‌లైన్‌లోనే ఉండేలా చూస్తామని చెబుతున్నారు.

జిన్నింగ్‌ మిల్లుల గ్రూపుల్లో మార్పులు

పత్తిని విక్రయించేందుకు కిసాన్‌ కపాస్‌ యాప్‌లో రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఎల్‌–1, ఎల్‌–2 ఇలా ఆప్షన్‌లు ఉంటాయి. దాన్ని బట్టి సమీపంలోని జిన్నింగ్‌ మిల్లుకు పత్తిని తరలించి తూకం వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సమీపంలోని జిన్నింగ్‌ మిల్లులకు స్లాట్‌ లభించక రైతులు కొంత ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతంలో ఉన్న మిల్లులకు పత్తిని తరలించాల్సి రావడంతో రవాణా ఖర్చులు భారంగా మారేవి. ఈ సమస్యను అధిగమించేందుకు జిన్నింగ్‌ మిల్లులను ఏ, బీ గ్రూపులుగా విభజించేలా ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

పత్తి కొనుగోళ్లకు సీసీఐ సన్నాహాలు

ఈసారి జహీరాబాద్‌లోనూ కొనుగోలు కేంద్రం

స్లాట్‌ బుకింగ్‌లో ఇబ్బందుల నేపథ్యంలో ఏ, బీ గ్రూపులగా మిల్లుల విభజన?

అత్యధికంగా పత్తి సాగయ్యే జిల్లాల్లో సంగారెడ్డిది నాలుగో స్థానం

ఆరంభంలో ఆశాజనకంగా ధర

ఈసారి పత్తి ధర కాస్త ఆశాజనకంగా ఉంది. గతేడాది కొనుగోలు సీజన్‌తో పోలిస్తే పత్తి కనీస మద్దతు ధర కంటే ఎక్కువే ఉంది. క్వింటాల్‌కు రూ.8,667 ఉంది. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.9,200 నుంచి రూ.9,500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర సీజన్‌ ముగిసే వరకు కొనసాగుతుందా..? లేదంటే రైతులు పత్తిని మార్కెట్‌లోకి తెచ్చే సమయానికి వ్యాపారులు ధరను తగ్గిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది కనీస మద్దతు ధర కంటే మార్కెట్‌ ధర రూ.రెండు వేలు తక్కువగా ఉండేది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

3.56 లక్షల ఎకరాల్లో సాగు

రాష్ట్రంలో అత్యధికంగా పత్తిని సాగు చేసే జిల్లాల్లో నల్గొండ, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌ తర్వాత సంగారెడ్డి జిల్లా ఉంటుంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఈసారి 3.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియక ఈసారి పత్తి దిగుబడి భారీగా తగ్గుతుందని అంచనా. ఎకరానికి పది క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి కేవలం నాలుగైదు క్వింటాళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. ఈలెక్కన సుమారు 17 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌లోకి వస్తుందని అనధికారిక అంచనా. గతేడాది 2025–26 కొనుగోలు సీజన్‌లో సీసీఐ జిల్లాలో 10.07 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు 95 వేల క్వింటాళ్లు కొన్నారు. ఈసారి దిగుబడి పడిపోవడంతో కాస్త తగ్గే అవకాశాలున్నాయని మార్కెటింగ్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement