ఈనెల 30 వరకు గడువు పెంచిన ప్రభుత్వం
జిల్లావ్యాప్తంగా 21 వేల దరఖాస్తులు
‘చేయూత’ దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యం
‘చేయూత’ పథకం ద్వారా కొత్తగా పెన్షన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఈనెల 15 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరణకు శ్రీకారం చుట్టింది. కానీ జిల్లాలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మాత్రం మందకొడిగా సాగుతోంది. గడువులోగా ప్రక్రియ పూర్తవుతుందా..? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సంగారెడ్డి జోన్
జిల్లావ్యాప్తంగా 28 మండలాలు 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మేరకు 21,000 మంది వివిధ రకాల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 25 వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు 15,957 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి కాగా, 2,588 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాకపోగా, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసినవి వివిధ స్థాయిలలో పెండింగ్‌లో ఉన్నాయి. పరిశీలన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30 వరకు గడువు పెంచింది. ఓవైపు దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన నత్తనడక సాగటం.. మరోవైపు ఆన్‌లైన్ వెరిఫికేషన్ ప్రక్రియ సాగకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఎంపీడీఓల లాగిన్‌లో పెండింగ్
క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. అనర్హులకు చోటు ఇవ్వకుండా పూర్తిగా పారదర్శకంగా ఉండే విధంగా కసరత్తు చేస్తున్నారు. దరఖాస్తుదారుల ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఇతర సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడికక్కడే ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. వెరిఫికేషన్ అనంతరం మండల అధికారులకు పంపిస్తున్నారు. అయితే ఎంపీడీఓలు తమ లాగిన్‌లలో వివరాలు పరిశీలించి అర్హులుగా గుర్తించాల్సి ఉంటుంది. జిల్లాలో 21 వేల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు కేవలం 2,588 మాత్రమే పూర్తిస్థాయిలో పరిశీలించారు. మిగితావి మండల కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
దసరాకు కొత్త పెన్షన్లు
దసరాకు కొత్త పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈమేరకు ఈనెల 30 వరకు లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు పరిశీలనకు రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.


