హాజరుకానున్న 29,093 మంది మహిళలు
సంగారెడ్డి టౌన్: స్వయం సహాయక సంఘాలలోని మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అందరికీ విద్య.. అందరి బాధ్యత’ అనే నినాదంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరక్షరాస్యులను గుర్తించి వారి కోసం గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వలంటీర్లను ఏర్పాటు చేసి వారికి విద్యను బోధించారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం 29,093 మంది మహిళలు పరీక్ష రాయనున్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 24,321 మంది, అర్బన్ ఏరియాలో 4,772 మంది పరీక్షకు హాజరు కానున్నారు. గతంలో పరీక్షకు హాజరు కాలేకపోయినా, పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారిని గుర్తించి వారి కోసం జిల్లా అధికారుల సమన్వయంతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇదే విషయమై జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సూర్యారావు మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలలో నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మహిళలకు పరీక్షను నిర్వహించి వారి ప్రతిభను వెలుగులోకి తెస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.


