సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘నిషేధిత’ కష్టాలు తీరనున్నాయి. 22–ఏ జాబితాలోని భూముల్లో ఉన్న ఇండ్లు, నివాస స్థలాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాటి యజమానులకు ఊరట లభించినట్లయింది. తమ తక్షణ ఆర్థిక అవసరాల కోసం వీటిని విక్రయించాలంటే ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు వీటిని రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి లభించడంతో తిప్పలు తప్పనుంది. జిల్లాలో ఈ నిషేధిత జాబితాలో ఏకంగా 318 అపార్టుమెంట్లు ఉన్నాయి. అలాగే 1,799 ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో కొన్ని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో ఉండటంతో అధికారులు 22– ఏ జాబితాలో చేర్చారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ, మున్సిపాలిటీలు, పంచాయతీల అనుమతి తీసుకుని నిర్మించుకున్న నివాసాలు కూడా ఈ 22–ఏ జాబితాలో చేరిపోయాయి. దీంతో ఎవరైన యజమానులు వీటిని విక్రయించాలంటే రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఓఆర్సీలు, ఎన్‌ఓసీలు లేకుండానే..
జిల్లాలో 22–ఏ జాబితాలో చేర్చిన భూములకు ఓఆర్సీలు లేవు. ప్రధానంగా ఇనాం భూములకు ఓఆర్సీలు లేకుండానే పట్టాలు మార్పిడి చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. అపార్టుమెంట్లు కూడా కట్టారు. నేతలు, బడాబాబులు తమ రాజకీయ పలుకుబడిని వాడుకుని దొడ్డిదారిన అనుమతులు తీసుకున్నారు. అలాగే మాజీ సైనిక ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పొలిటికల్ సఫరర్లకు కేటాయించిన భూములను కూడా దొడ్డిదారిన కొనుగోలు చేసిన నాయకులు వాటికి సరైన ఎన్‌ఓసీలు లేకుండా ప్లాట్లు చేసి విక్రయించారు. దొడ్డిదారిన అనుమతులు తీసుకున్నారు. మరోవైపు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం, బఫర్‌జోన్లలో ఉన్న భూముల్లో కూడా వెంచర్లు వేశారు. వీటన్నింటిని 22–ఏలో చేర్చారు. ఈ క్రమంలో అన్ని అనుమతులున్న ప్లాట్లు, ఇండ్లు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. ఇప్పడు అన్ని అనుమతులు ఉన్న వాటికి విముక్తి లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
నిషేధిత జాబితాలో 318 అపార్టుమెంట్లు, 1,799 ఇండ్లు
అనుమతులున్న స్థిరాస్తులకు ఇకపై రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వ నిర్ణయంతో అర్హులైన వారికి ఊరట
పటాన్‌చెరు, సంగారెడ్డిలో..
నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్లు, ప్లాట్లు ఎక్కువగా పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. వేల ఎకరాలు ఈ జాబితాలో చేర్చారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఆ తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంలోనూ ఈ 22–ఏ ఇండ్లు, పాట్లు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు ఉన్న నిర్మాణాలు, ప్లాట్లకు ఇకపై రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. 22–ఏలో స్థిరాస్థులు ఉన్న యజమానులు రిజిస్ట్రేషన్ల కోసం ఇన్నాళ్లు అధికారుల చుట్టూ తిరిగారు. వీటిని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో అధికారుల కమిటీని నియమించిన విషయం విధితమే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు చాలా మంది ఫిర్యాదు చేశారు. మరోవైపు కలెక్టర్‌లో కూడా ఈ బాధితులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులను అన్ని అర్హతలున్న వాటికి జాబితాలోంచి తొలగిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.


