రెవెన్యూలో అవినీతి లీలలు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో అవినీతి లీలలు

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

● పత్రం కావాలంటేపైకం చెల్లించాల్సిందే..

● ప్రతి పనికీ ‘రేటు’ ఉందంటున్న ప్రజలు

● ఫోన్‌ పే ద్వారా లావాదేవీలు

కొండాపూర్‌(సంగారెడ్డి): సర్టిఫికెట్‌ కావాలన్నా.. రికార్డు.. పట్టాదారు పాస్‌ పుస్తకమైనా.. ట్రూ కాపీ తీసుకోవాలన్నా.. పైకం చెల్లించాల్సిందే.. మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంపై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వస్తున్న సామా న్యులు రోజుల తరబడి తిరుగుతున్నా పనులు ముందుకు సాగడం లేదని, డబ్బులు ఇచ్చిన వారి ఫైళ్లు మాత్రం వేగంగా కదులుతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు

తహసీల్దార్‌ కార్యాలయంలో పలు రెవెన్యూ సేవలకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టాపాస్‌బుక్‌ పనికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు, సర్టిఫికెట్‌కు రూ.500, రికార్డులకు రూ.4 వేలు, ట్రూ కాపీకి రూ.5 వేల వరకు అడుగుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఓ బాదితుడు ట్రూ కాఫీ కోసం దరఖాస్తు చేసుకోగా, సదరు అధికారి డీడీ కట్టాలంటే రూ. 8 వేల వరకు అవుతుందని, కానీ రూ. 5 వేలు ఇస్తే ట్రూ కాఫీ ఇస్తా అంటూ వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు.

డబ్బులు ఇస్తే వేగం.. ఇవ్వకపోతే జాప్యం?

తమకు అవసరమైన పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడిన వారి పనులు మాత్రం త్వరగా పూర్తవుతున్నాయని వాపోతున్నారు. కొందరు సమయం, కూలీ నష్టం భరించలేక అడిగినంత చెల్లించి పని చేయించుకుంటున్నారని, ఆర్థిక స్థోమత లేని వారు మాత్రం పదేపదే కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారని చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో తమ పని చక్కబెడతామంటూ కొందరు మధ్యవర్తులు ప్రజలను సంప్రదిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేయడం నుంచి పత్రాలు చేతికి అందే వరకు ప్రతి దశలోనూ ఖర్చు ఉంటుందని చెప్పడంతో సామాన్యులు అయోమయానికి గురవుతున్నారని పలువురు అంటున్నారు.

ఉన్నతాధికారులు

దృష్టి సారించాలి

ప్రజలకు నిర్ణీత రుసుములతో పారదర్శకంగా సేవలు అందించాల్సిన రెవెన్యూ వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, అక్రమ వసూళ్లు జరిగినట్లు తేలితే బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement