అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: గ్రామ అభివద్ధికి అవసరమయ్యే వాటిని గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వికసిత్ పంచాయతీ ప్రణాళికపై సర్పంచ్‌లు, అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న స్థానిక వనరులు, మౌలిక వసతులు, లోటుపాట్లను గుర్తించి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నీటి భద్రత, మౌలిక వసతులు, జీవనోపాధి అవకాశాలు, ప్రకృతి విపత్తు ప్రభావాలు తగ్గించే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వివరించారు. చెరువుల పునరుద్ధరణ, ఇంకుడు గుంతలు, బోర్ వెల్ రీఛార్జ్ పనులు, వర్షపు నీటిని ఒడిసి పట్టే విధంగా పనులు నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామ అభివద్ధికి సహకరించాలన్నారు. గ్రామాల వారీగా సభలు నిర్వహించి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీఆర్‌డీఓ జ్యోతి, డీపీఓ మల్లారెడ్డి, అదనపు డీఆర్‌డీఓ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


