● ఈ నెల 26 నుంచి రెండు నెలలపాటు అమలు ● ఇస్నాపూర్ జంక్షన్‌లో ఫేజ్–2ఫ్లై ఓవర్, అండర్ పాస్ పనులు ● ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల మళ్లింపు
పటాన్‌చెరు టౌన్: జాతీయ రహదారి–65 పై ఈ నెల 26 నుంచి రెండు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు పరిధిలోని ఇస్నాపూర్ జంక్షనన్ వద్ద ఫేజ్–2 ఫ్లైఓవర్, వెహికల్ అండర్‌పాస్ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆర్సీపురం, పటాన్‌చెరు నుంచి కంది, సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాలను నవాపాడ్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి కర్దనూర్ ఎక్స్‌రోడ్ మీదగా ఐడీఏ పాశమైలారం, ఇంద్రకరణ్ మీదుగా కంది, సంగారెడ్డికి చేరుకోవచ్చు.
ముత్తంగి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్–3..
ముత్తంగి ఓఆర్‌ఆర్ ఎగ్జిట్–3 (ముత్తంగి) నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాలను ఎన్‌హెచ్–65పైకి అనుమతించకుండా సర్వీస్ రోడ్డు మీదుగా కర్దనూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఐడీఏ పాశమైలారం, ఇంద్రకరణ్, కంది మార్గంలో మళ్లించనున్నారు.
వాహనదారులు సహకరించాలి
నిర్మాణ పనులు సజావుగా సాగేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ప్రయాణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే రాకపోకలను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.


