కలెక్టర్ ప్రతీక్ జైన్
మునిపల్లి(అందోల్): పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మండలంలోని బుదేరా మహిళా రెసిడెన్షియల్ కళాశాల, తహసీల్దార్ కార్యాలయం, మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని బుదేరా మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు కలెక్టర్ సూచించారు. శానిటేషన్ పనులను ఎప్పటికప్పుడు నిర్వహించి శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భూ భారతిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని తహసీల్దార్ రంగారావుకు ఆదేశించారు. ఎస్‌ఐఆర్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తైన యువత ఓటు నమోదు ఎంతవరకు వచ్చిందనే వివరాలను తహసీల్దార్‌ను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఆస్పత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య సిబందిని అడిగారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు సక్రమంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు సాయికిరణ్, జిల్లా పంచాయతీ అధికారి ధనుంజయ్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి జగదీశ్, యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి అఖిలేష్, మండల ప్రత్యేకాధికారి రామానుజంచారి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


