సంగారెడ్డి: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి రాంనగర్‌లోని రామ్ మందిర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి సంగీత విభావరి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను అలరించాయి. అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండపంలో డోలక్ వాయిస్తూ భజన పాటలు పాడారు. భక్తి గీతాలు, భజనలతో రామ్ మందిర్ పరిసరాలు మార్మోగాయి. గురువారం తెల్లవారుజాము వరకు సంగీత విభావరి కొనసాగింది. కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జయారెడ్డి, పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


