పర్యాటకులకు స్వర్గధామం ముమ్మరంగా సాగుతున్న పనులు
మారనున్న హుస్నాబాద్ ముఖచిత్రం ● రూ.10 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కు
దట్టమైన అడవి, అలరించే లోయలు, అరుదైన పక్షుల కిలకిలారావాలు, శతాబ్దాల నాటి ప్రాచీన రాతి కోటలు కలగలిపి ఉన్న ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనుంది. చరిత్రకు, ఆధ్యాత్మికతకు, సాహస పర్యాటకానికి అనువైన కోటగిరి గుట్టలు అర్బన్ ఫారెస్ట్ పార్కుగా ఆవిష్కృతం కాబోతున్నాయి.
హుస్నాబాద్: మండల పరిధిలోని జిల్లెల్లగడ్డలో రూ.10 కోట్ల వ్యయంతో సర్దార్ సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్టు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన కూడా చేశారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రకృతి సంపదను పరిరక్షిస్తూ చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా ఈ ప్రాజెక్టును రూపుదిద్దుతున్నారు. ఈ పార్కుతో పాటు ఎల్లమ్మ చెరువు గ్లాస్ బ్రిడ్జి, మహాసముద్రం గండి, రాయికల్ జలపాతం, గౌరవెల్లి ప్రాజెక్టును అనుసంధానిస్తూ సమగ్ర పర్యాటక సర్క్యూట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హుస్నాబాద్ ప్రముఖ మోడల్ టూరిజం హబ్‌గా అవతరించనుంది. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు విస్తరించి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అడవిలో పర్యాటక విహారం


