హుస్నాబాద్: కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన గూడ పద్మ శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తల్లి పద్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడు నిఖిల్ రెడ్డి (17) స్థానిక మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తనను ప్రైవేట్ కళాశాలలో చదివించాలని నిఖిల్ రెడ్డి తల్లిని అడుగగా ఆర్థిక స్తామత లేకపోవడంతో ఆమె మందలించింది. దీనికి తోడు పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం.. ఆమె భర్త కూడా మరణించడంతో ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన నిఖిల్ రెడ్డి జీవితం పై విరక్తి చెంది బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి నిఖిల్ రెడ్డి చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. గణేశ్ మండపం నుంచి తిరిగి వచ్చిన తల్లి కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవిగా కనిపించడంతో గుండెలవిసెలా రోదించింది. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


