● నాలుగున్నర తులాల బంగారం.. ● 47 తులాల వెండిని ఎత్తుకెళ్లిన దొంగలు
మిరుదొడ్డి(దుబ్బాక): రైతులు ఇళ్లకు తాళాలు వేసి వ్యవసాయ పొలాలకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లకిడి ప్రకాష్, వజ్జపల్లి నర్సింగరావు అనే రైతులు ఎప్పటిలాగే తమ తమ ఇళ్లకు ఉదయం తాళాలు వేసి వ్యవసాయ పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి తమ ఇండ్లకు తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగుల గొట్టి ఉండటాన్ని చూసి ఒక్క సారిగా అవాక్కయ్యారు. ఇంట్లో ఉన్న బీరువాలను పగులగొట్టి ఉండటం, సామాన్లు, బట్టలు చిందరవందరగా పడి ఉండటం చూసి ఖంగు తిన్నారు. లకిడి ప్రకాష్ ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సుమారు 25 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్ళారు. అలాగే వజ్జెపల్లి నర్సింగరావు ఇంట్లో నుంచి, తులం బంగారం, 22 తులాల వెండి ఆభరాణాలను ఎత్తుకెళ్ళారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ రాజేష్, మిరుదొడ్డి ఎస్‌ఐ అందె సతీష్ నేతృత్వంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ ఘటనపై విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో దొంగల వేలి ముద్రలను సేకరించారు.


