రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్
మెదక్ కలెక్టరేట్: విశ్వకర్మల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కార్పొరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర కార్మిక శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవంలో మంత్రి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేశారు. అనంతరం స్థానిక రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన విశ్వకర్మ జయంతిలో ముఖ్య అతిథిగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశ్వకర్మల కోసం ఏటీల్లో కోర్సు ప్రారంభించేలా సిఫారసు చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసంలో విశ్వకర్మలకు అవకాశం కల్పిస్తామన్నారు. విశకర్మలు నూతన టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు. విశ్వకర్మ సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి మంత్రి హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ డీవీ. శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, విశ్వకర్మ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


